ముంబై: దేశంలోనే ఎక్కువ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ ఎంతకూ కరోనా అదుపులోకి రావడం లేదు. నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో నుంచి సగం మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35 వేల మంది ఖైదీల్లో 17 వేల మందిని బయటకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్ మీద వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. (ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం)
అయితే యూఏపీఏ, ఎమ్‌సీఓఏ, పీఎమ్ఎల్ఏ వంటి తీవ్ర నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపిచబోమని స్పష్టం చేసింది. కాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఖైదీలు, జైలు అధికారులతో కలిపి 100 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్యంగా జీవించడం ప్రాథమిక హక్కు అని, ఖైదీలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జైల్లోని ఖైదీలను బయటకు పంపించివేస్తున్నట్లు తెలుస్తోంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు)
Comments
Please login to add a commentAdd a comment