మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్ర
ముంబై: మదర్సాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఓ నిర్ణయానికి వచ్చింది. మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి దిలీప్ కాంబ్లీ గురువారం నాడు ప్రకటించారు. ఇతర పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటుగా ఈ మతపర సంస్థలలో చదివే విద్యార్థులను సమానంగా పరిగణించనవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
మదర్సాలలో కూడా ఇతర స్కూళ్లలో మాదిరిగా తరగతులు నిర్వహిస్తేనే నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కానీ అటువంటి విద్యాసంస్థల్లో మతపరమైన అంశాలు నేర్చుకునే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మదర్సాలలో కూడా సైన్స్, గణితం, సాంఘీక శాస్త్రము వంటి సబ్జెక్టులు బోధించాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే గతంలోనే సూచించిన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మదర్సాల గురించి మాట్లాడుతూ 'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే అటువంటి సంస్థలపై నిషేధం విధించాలని గత మే నెలలో ఆయన సూచించిన విషయం తెలిసిందే.