ఈ నెల 30 నే అతనికి ఉరి
ముంబై: ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు బుధవారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేశాయి. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలు కానుంది.
అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముంబై పేలుళ్ల ముద్దాయి పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ ను ఉన్నత ధర్మాసనం తిరస్కరిస్తే యాకూబ్ ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే దీనిపై తదుపరి విచారణ జూలై 21 ఉంటుందని తెలుస్తోంది.
కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.