Maha government
-
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
షిండే ప్రభుత్వం చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం: ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ) కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు సమావేశమయ్యాయి. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి ఉమ్మడిగానా లేదా స్వతంత్రంగానా? అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘మూడు పార్టీలు కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ఆటంకం(షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం) చాలా చిన్నది. దానిని మేము అధిగమించి కలిసే ఉన్నామని దేశానికి సందేశం ఇస్తాం. గతంలో కంటే ఇప్పుడే ఎంవీఏ బలంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము కలిశాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనివ్వండి.’ అని పేర్కొన్నారు ఉద్ధవ్ థాక్రే. అందుకే అక్కడ భేటీ.. ఎంవీఏ భాగస్వామ్య పక్షాలు కలిసే ఉన్నాయని, ఈ సమావేశం ద్వారా ఆ సందేశాన్ని అందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ఈ సమావేశం రాష్ట్ర శాసనసభలోని శివసేన శాసనసభాపాక్ష పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహా వికాస్ అఘాడీతోనే శివసేన ఉందనటమే కాదు.. థాక్రే వర్గమే అధికారిక శివసేన అనే సందేశాన్ని షిండే ప్రభుత్వానికి పంపించేందుకు ఇక్కడ భేటీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. థాక్రేతో పాటు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్, దిలిప్ వాల్సే పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహేబ్ థోరట్, పృథ్విరాజ్ చావన్, అశోక్ చావన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి రైస్ షేక్ వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇదీ చదవండి: శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు -
ఉత్కంఠకు తెర.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ మద్దతుతో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎం పీఠాన్ని అధిరోహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు గడిచిపోయినా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సీఎం షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం మంత్రివర్గ విస్తరణ ఉండనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, షిండే సేనల నుంచి మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మంత్రి చొప్పున 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరిష్ మహజన్, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేసర్కార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు మంగళవారం కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆ ఇరువురే ద్విసభ్య కేబినెట్‌ను నడుపుతున్నారు. దీంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఫడ్నవీస్, షిండేలు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే మరింత మందిని కేబినెట్లోకి తీసుకుంటాని గత శనివారం తెలిపారు షిండే. ఇదీ చదవండి: శరద్ పవార్ ‘కంచుకోట’పై బీజేపీ కన్ను.. కేంద్ర మంత్రికి బాధ్యతలు -
ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు వారాలైంది.. కేబినెట్ సంగతేంటి?
ముంబై: మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నాలుగు వారాలు దాటింది. కానీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప కేబినెట్‌పై షిండే, బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఆగస్టు 1 తర్వాత కొత్త మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నా.. దానిపైనా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడానికి షిండే వర్గమే కారణమని బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ షిండే తన కేబినెట్లో చోటు కల్పిస్తారని ఇప్పటికే ఖరారైంది. కానీ షిండే వర్గంలోని ఇతర ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని చల్లబర్చేందుకే కేబినెట్ విస్తరణను ఆలస్యం చేస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు. మంత్రివర్గంపై పార్టీ ఉన్నత స్థాయి నాయకులే చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో గుజరాత్ ఫార్ములాను పాటించాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన వారిలో పాతవాళ్లకు కాకుండా మొత్తం కొత్తవారికే కేబినెట్లో చోటు కల్పించనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ నేపథ్యంలోనే షిండే సహా కీలక నేతలు తరచూ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. షిండే వర్గం మాత్రం తమకు మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఆయనకే మద్దతుగా ఉంటామని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్నందునే కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. రెండు దఫాలుగా.. అయితే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో 25 మందితో కేబినెట్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు మరికొందరికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపాయి. మొదటి కేబినెట్లో తమకు 14 నుంచి 15 బెర్తులు దక్కుతాయని షిండే వర్గం చెబుతోంది. చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు.. -
మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మహిళలకు భారీ కేటాయింపులు చేయన్నుట్లు ప్రకటించారు. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు. మహిళలకు మహారాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
ఈ నెల 30 నే అతనికి ఉరి
ముంబై: ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు బుధవారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేశాయి. నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలు కానుంది. అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముంబై పేలుళ్ల ముద్దాయి పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ ను ఉన్నత ధర్మాసనం తిరస్కరిస్తే యాకూబ్ ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే దీనిపై తదుపరి విచారణ జూలై 21 ఉంటుందని తెలుస్తోంది. కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్‌ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.