ఈ నెలాఖర్లో మెమన్‌కు ఉరి!
నాగ్‌పూర్ జైల్లో ఏర్పాట్లు
* క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం
* వెలువడగానే శిక్ష అమలుకు సన్నాహాలు
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది.
అనంతరం మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ర్టపతి కూడా తిరస్కరించారు. అయినా శిక్షను పునఃసమీక్షించాల్సిందిగా అతడు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. దీనిపై సుప్రీం త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది. ‘సుప్రీంకోర్టు ఏం చెబితే అది అమలు చేస్తాం. సరైన సమయంలో మీడియాకు సమాచారం అందిస్తాం’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. సుప్రీం తీర్పును అమలు చేస్తే పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన తొలి దోషి మెమనే కానున్నాడు. ప్రస్తుతం ఇతడు నాగ్‌పూర్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. సాధారణంగా ఉరిశిక్షలను ఇక్కడే అమలు చేస్తుంటారు.
నాకు తెలియదు: జైలు సూపరింటెండెంట్
మెమన్‌కు సంబంధించిన డెత్ వారెంట్లు జైలుకు అందాయా? అని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్‌ని అడగ్గా.. ‘నాకు తెలియదు. ఇది ప్రభుత్వం స్థాయిలో జరిగే వ్యవహారం’ అని ఆయన పేర్కొన్నారు. మెమన్‌ను ఉరికంభం ఎక్కిస్తే.. నేరం చేసినవారికి శిక్ష తప్పదన్న బలమైన సంకేతం సమాజంలోకి వెళ్తుందని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు.
ఇదీ కేసు నేపథ్యం..: 1993, మార్చి 12 (శుక్రవారం) రోజున దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇందులో 250 మందికి పైగా అమాయకులు మరణించగా, సుమారు 1200 మంది గాయపడ్డారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు సూత్రధారిగా తేలింది. పేలుళ్లలో దావూద్ అనుచరుడైన టైగర్ మెమన్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
భారత్, పాక్‌లోని కొందరు స్మగర్లు దాడులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో పాక్ ఐఎస్‌ఐ హస్తం ఉందని, అనేక మంది ఉగ్రవాదులకు పాక్‌లో శిక్షణ ఇచ్చి ముంబై పంపారని భారత్ పేర్కొంది. అయితే అధికారులు దీన్ని కోర్టులో నిరూపించలేకపోయారు.