మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గత అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బెనీవాల మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను మిజోరం గవర్నర్గా బదిలీ చేశారు. అనంతరం ఆమెను మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మిజోరం గవర్నర్ పదవి ఖాళీ అయింది. అయితే మరో రెండు నెలల్లో కమలా బెనీవాల్ పదవి కాలం ముగియనన్న సమయంలో ఆమెపై వేటు పడిన సంగతి తెలిసిందే.