ముంబై : కరోనా వైరస్ రోగులకు సిఫార్సు చేసే ఔషధాల కొరతను నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మందుల కొనుగోలుకు అవసరమైన నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మందులను కొనాలంటే ప్రజలు ఇప్పుడు తమ ఆధార్ కార్డు, కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా అందచేయాలని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా 2.38 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న మహారాష్ట్రలో కరోనా చికిత్సకు వాడే రెమిడిసివిర్, టొసిలిజుమబ్ వంటి మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
తమ వద్ద మందుల నిల్వలు సరిపడా ఉన్నా డిమాండ్ విపరీతంగా పెరగుతుండటంతో వీటికి కొరత ఏర్పడిందని రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌లో ఈ మందులు అమ్ముతున్నారనే ఫిర్యాదులు అందాయని, బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కరోనా ఔషధాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, మందులపై అదనంగా ఎవరైనా వసూలు చేస్తే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తే తాము చర్యలు చేపడతామని చెప్పారు. తీవ్ర లక్షణాలతో బాధపడే కోవిడ్-19 రోగులకు అత్యవసర వినియోగం కింద రెమిడిసివిర్‌ను వాడేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment