ముంబై: అత్యాచార ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్‌ను సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణల కేసులో పరాస్కర్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే పరాస్కర్‌ను సస్పెండ్ చేయాలని, తాను నిర్దోషినని రుజువు చేసుకునేందుకు పరాస్కర్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకొని దర్యాప్తునకు సహకరించాలని మహిళా కమిషన్ చైర్మన్ సుశీబెన్ షా డిమాండ్ చేశారు.
ఈ విషయమై ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు లేఖ రాశారు. ‘దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్నా, ఎటువంటి బెదిరింపులు లేకుండా సాక్షులు నిజానిజాలు వెల్లడించాలన్నా పరాస్కర్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే’నని షా లేఖలో పేర్కొన్నారు. పరాస్కర్‌కు లైడిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు అవసరమైన అనుమతులు పొందాలన్నారు. ‘దినపత్రికల్లో ఈ విషయమై నేనో వార్త చదివాను. పరాస్కర్‌కు లైడిటెక్టర్ టెస్ట్‌కు ఎంతమాత్రం అంగీకరించరని, ఆయనకు ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగిందని పరాస్కర్ తరఫు న్యాయవాది చెప్పడం విడ్డూరంగా ఉంది. దీనిపై నగరంలోని ఓ ప్రముఖ హృద్రోగ నిపుణుడిని సంప్రదించాను.
పరాస్కర్‌కు లైడిక్టర్ టెస్ట్ నిర్వహించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అవసరమైతే మీరు కూడా కార్డియాలజిస్టుల సూచనలు తీసుకొని లైడిటెక్టర్ టెస్ట్‌ను నిర్వహించండ’ని షా డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పరాస్కర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2), 376(సి), 354(డి) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
చిక్కుల్లో పరాస్కర్
Published Mon, Aug 4 2014 10:49 PM | Last Updated on Mon, Oct 8 2018 5:52 PM
Advertisement