Sunil Paraskar
-
'చెల్లిలా సంబోధించారు'
ముంబయి : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై డీఐజీ సునీల్ పరాస్కర్‌పై మోడల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూన్ 27న మోడల్‌కు పంపిన ఓ ఈ-మెయిల్లో ఆమెను చెల్లిగా సంబోధించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆరోపణలు చేసిన మోడల్ కూడా దీనిపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, దీంతో వారిద్దరి మధ్య మోడల్ ఆరోపణలు చేస్తున్నటువంటీ సంబంధమేదీ లేదనే విషయం స్ఫష్టం అవుతోందని కోర్టుకు తెలిపారు. సునీల్ పరాస్కర్ తనను రేప్ చేశారంటూ ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గత బుధవారం రాత్రి మలవానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా మోడల్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ టీవీ రియాల్టి షోలో పాల్గొనేందుకు వివాదాన్ని సృష్టించడానికి కుట్ర పన్నానంటూ ఆ మోడల్ తనకు స్పష్టం చేసిందని ఆమె మాజీ లాయరైన రిజ్వన్ సిద్దిఖి ఆరోపించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె కేసు పెట్టిందని భావించడంవల్లే తాను ఈ కేసు నుంచి తప్పుకొన్నానని ఆయన తెలపటం విశేషం. లాయర్ వాంగ్మూలాన్ని పోలీసులు మూడు రోజుల క్రితం నమోదు చేశారు. మోడల్‌కి, తనకు మధ్య నడిచిన సంభాషణల తాలుకు సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. దాంతో మోడల్ కేసు సినిమాలో కంటే ఎక్కువగా రోజుకో మలుపు తిరుగుతోంది. -
వెనక్కు తగ్గిన శివసేన
ముంబై: మగాళ్లపై అత్యాచార ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందంటూ సామ్నా సంపాదయకీయంలో రాసిన వివాదాస్పద రాతలపై శివసేన వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ‘ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ వివాదం నేపథ్యంలో సామ్నా రాసిన సంపాదకీయాన్ని తప్పుగా అర్థం చేసుకొని శివసేన పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోంది. అత్యాచారమనేది తీవ్రమైన నేరమే. ఈ విషయంలో శివసేనకు మరో అభిప్రాయం లేదు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యాచార ఆరోపణలు చేయడం కూడా తీవ్రమైన నేరమే’నని తాజా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలు కేసు నమోదు చేయాలని సంపాదకీయంలో స్పష్టంగా చెప్పామని పేర్కొంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఐదారు నెలల్లో వైద్యపరమైన సాక్ష్యాలు విలువలేనివిగా మారిపోతాయని, కేసు అనేక మలుపులు తిరుగుతుందనే అభిప్రాయాన్ని మాత్రమే తాను వ్యక్తం చేశామని శివసేన పేర్కొంది. మరాఠీలో రాసిన సంపాదకీయాన్ని అనువాదం చేసే సమయంలో అనేక వక్రీకరణలో చోటుచేసుకున్నాయని, అంతా శివసేనవైపే వేలెత్తి చూపుతున్నారే తప్ప మరోవైపు చూడడంలేదని పేర్కొంది. టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు జర్నలిజంపై అత్యాచారం చేశాయని విమర్శించింది. ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంపై దృషి సారించాలని శివసేన డిమాండ్ చేసింది. సామ్నా సంపాదకీయం విషయంలో ఎటువంటి వివాదానికి తావులేదని, సునీల్ పరస్కార్ కేసు కోర్టు పరిధిలో ఉందని సూచించింది. ఇదిలాఉండగా ‘ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపడానికి ఉన్నతవర్గాలకు చెందినవారిపై అత్యాచారం, అత్యాచారయత్నం కేసులు పెట్టడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది. డీఐజీ సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలు పోలీసుశాఖలో పనిచేశారు. ఓ మోడల్ ఆయనపై ఆరోపణలు చేయగానే రాత్రికి రాత్రే ఆయన విలన్ అయిపోయారు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి చట్టాలు ఆయుధాలుగా మారుతున్నాయ’టూ సామ్నా సంపాదకీయంలో రాయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేపుతోంది. -
చిక్కుల్లో పరాస్కర్
ముంబై: అత్యాచార ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్‌ను సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణల కేసులో పరాస్కర్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే పరాస్కర్‌ను సస్పెండ్ చేయాలని, తాను నిర్దోషినని రుజువు చేసుకునేందుకు పరాస్కర్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకొని దర్యాప్తునకు సహకరించాలని మహిళా కమిషన్ చైర్మన్ సుశీబెన్ షా డిమాండ్ చేశారు. ఈ విషయమై ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు లేఖ రాశారు. ‘దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్నా, ఎటువంటి బెదిరింపులు లేకుండా సాక్షులు నిజానిజాలు వెల్లడించాలన్నా పరాస్కర్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే’నని షా లేఖలో పేర్కొన్నారు. పరాస్కర్కు లైడిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు అవసరమైన అనుమతులు పొందాలన్నారు. ‘దినపత్రికల్లో ఈ విషయమై నేనో వార్త చదివాను. పరాస్కర్కు లైడిటెక్టర్ టెస్ట్‌కు ఎంతమాత్రం అంగీకరించరని, ఆయనకు ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగిందని పరాస్కర్ తరఫు న్యాయవాది చెప్పడం విడ్డూరంగా ఉంది. దీనిపై నగరంలోని ఓ ప్రముఖ హృద్రోగ నిపుణుడిని సంప్రదించాను. పరాస్కర్కు లైడిక్టర్ టెస్ట్ నిర్వహించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అవసరమైతే మీరు కూడా కార్డియాలజిస్టుల సూచనలు తీసుకొని లైడిటెక్టర్ టెస్ట్‌ను నిర్వహించండ’ని షా డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పరాస్కర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2), 376(సి), 354(డి) తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
ఆ డీజీపీ నన్ను రేప్ చేశాడు: ముంబై మోడల్
ముంబై: మహారాష్ట్రలో సీనియర్ ఐపీఎస్ అధికారిపై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపాయి. ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) తనను రేప్ చేశారంటూ ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి మలవానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు మంగళవారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను కలసి పరాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. మరోవైపు పరాస్కర్‌పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మోడల్‌పై డీఐజీ అత్యాచారం ... కేసు నమోదు
ముంబై: తనపై ఐపీఎస్ అధికారి, డీఐజీ సునీల్ పరస్కర్ అత్యాచారం చేశారని ముంబైకి చెందిన ఓ మోడల్ నగర పోలీసులను ఆశ్రయించింది. దాంతో సునీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ లోకరి గురువారం ముంబైలో వెల్లడించారు. గతంలో కూడా చాలా సార్లు తనపై సునీల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. నగర శివారులలోని ఓ హోటల్లో సునీల్ తనపై వ్యవహారించిన తీరును కూడా ఆ ఫిర్యాదులో మోడల్ వివరించిందని రమేష్ చెప్పారు. ఐపీఎస్ అధికారి సునీల్ గత కొద్ది కాలం క్రితం వరకు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఉత్తర ప్రాంతం)గా పని చేసే వారని తెలిపారు. ప్రస్తుతం ప్రోటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యూనిట్స్ డిఐజీగా సునీల్ విధులు నిర్వర్తిస్తున్నారని రమేష్ చెప్పారు.