కోల్‌కతా: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మూడు మాసాల ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ సమీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. దీదీ మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన కల్లోలాన్ని సమర్థవంతంగా అంతం చేయడంతో పాటుగా.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లను ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. (కేంద్రం తీరుపై మమతా బెనర్జీ అసహనం)
ఈ క్రమంలో రెడ్ జోన్ ఏలో లాక్‌డౌన్ నిబంధనలకు మినహాయింపు లేదన్న మమత.. రెడ్ జోన్ బీలో కొన్ని సడలింపులు ఇస్తామన్నారు. ఇక రెడ్ జోన్ సీలో బీ కంటే మరిన్ని ఎక్కువ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. సదరు ప్రాంతాలు, ఆయా చోట్ల ఏయే షాపులు తెరవాలో నిర్ణయాంచాల్సిన బాధ్యతను కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించామని మమత తెలిపారు. కాగా గ్రీన్‌జోన్లలో బస్సులు నడిపేందుకు పశ్చిమ బెంగాల్ సర్కారు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 13 బస్సు సర్వీసులు అందుబాటులోకి రాగా.. ఒక్కో బస్సులో కేవలం 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. (రీస్టార్ట్‌కి రెడీ అవుదాం)
అదే విధంగా గ్రీన్ జోన్లలో జ్యువెల్లరీ, ఎలక్ట్రిక్ వస్తువులు, పెయింట్ స్టోర్లు, చిన్న చిన్న దుకాణాలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఆరింటి దాకా తెరచుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే క్రమంలో.. బీడీ పరిశ్రమను తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే 50 శాతం మందిని మాత్రమే పనిచేసేందుకు కంపెనీలోకి అనుమతించనున్నారు. అదే విధంగా సామాజిక ఎడబాటు పాటిస్తూ సినీ, టీవీ ఇండస్ట్రీ కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే షూటింగ్‌లు వద్దని, కేవలం ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే చేసుకోవాలని ఆదేశించింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు ఇప్పుడే ప్రారంభించే అవకాశమే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment