పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా: బీజేపీలాంటి మతతత్వ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా రానున్న పార్లమెంట్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో జరుగునున్న ఐదు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో నాలుగు స్థానాలను తృణమూల్ కైవసం చేసుకోనుంది. ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభిషేక్ మను సింఘ్వీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని మమత బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఐదో స్థానం కోసం వామపక్షాల అభ్యర్థి రాబిన్‌దేవ్, కాంగ్రెస్ అభ్యర్థి సింఘ్వీ మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మమత ఇచ్చిన ఆఫర్ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే, బీజేపీ, తృణమూల్ పార్టీలను ఓడించేందుకు వామపక్షాలతో కలిసి మరోసారి కూటమిగా ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ప్రకటించారు. ఇందులోభాగంగా ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కూడా ఆయన ప్రతిపాదించారు. అయితే, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఈ సమీకరణాలు అంతగా ఫలించినట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపడంతో లెఫ్ట్‌ను కాంగ్రెస్ పార్టీని దూరం చేసి.. తమవైపు తిప్పుకునేందుకు మమత పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇటీవలి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పాతికేళ‍్ల వామపక్ష సర్కారును బీజేపీ గద్దె దించడం.. ఇక తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడమేనని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కమలదళానికి చెక్ పెట్టేందుకు రాజకీయ పొత్తులకు మమత తెరతీస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి 23న రాష్ట్రంలోని ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment