పెళ్లైన రెండు గంటలకే 'తలాక్' చెప్పాడు!
మీరట్: పెళ్లి గురించి అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలుకంది. భర్తతో సంతోషకర జీవితాన్ని ఊహించుకొని మురిసిపోయింది. చివరికి పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. అనుకున్నట్లే పెళ్లైంది. కానీ అంతలోనే ఊహించని మలుపు.. పెళ్లయిన రెండు గంటలకే నవవరుడు ఆమెకు తలాక్ చెప్పాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమైందా యువతి.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన వివరాలు. దహా గ్రామానికి చెందిన మొహిసినా అనే యువతికి.. ఆ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ పూర్ వాసి మహ్మద్ ఆరిఫ్ తో పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ముందుగా అనుకున్న ప్రకారం యువతి కుటుంబ సభ్యులు కట్నకానుకలను సిద్ధం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు తనకు కట్నంగా కారు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాహం అనంతరం ఈ విషయమై గొడవపడి పెళ్లికూతురుకు ఆవేశంగా తలాక్ చెప్పేశాడు. గ్రామ పెద్దలు ఈ విషయమై నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కుదరకపోవటంతో పంచాయితీ పెట్టి.. పెళ్లికూతురు కుటుంబానికి వరుడు రూ. 2.5 లక్షలు భరణం చెల్లించేలా తీర్మానం చేశారు. అలాగే ఆరిఫ్ మరో మూడేళ్లపాటు పెళ్లి చేసుకోరాదనే షరతు విధించారు.
తలాక్ విధానంపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ 50,000 మంది ముస్లిం మహిళలు, పురుషులు సంతకాలు చేసిన పిటిషన్ను 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమిషన్కు సమర్పించారు.