పెళ్లి చేయడంలేదని.. తండ్రిని చంపిన తనయుడు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేయడంలేదని.. తండ్రిని చంపిన తనయుడు

Published Sun, Oct 15 2023 1:14 AM | Last Updated on Sun, Oct 15 2023 11:58 AM

- - Sakshi

మార్కాపురం రూరల్‌: తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహంలో కన్నతండ్రిని కుమారుడు కత్తితో గొంతుకోసి చంపిన సంఘటన మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. మార్కాపురం రూరల్‌ ఎస్సై వెంకటేశ్వర నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామంలోని కనకదుర్గ కాలనీకి చెందిన పత్తిపాటి బాల భద్రాచారి (57), భార్య లక్ష్మీకాంతమ్మకు కుమారుడు గురునారాయణతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కుమారుడు పదో తరగతి పూర్తయిన తరువాత వడ్రంగి పనిచేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే 25 ఏళ్లు వచ్చినా తనకు పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులతో తరచుగా గొడవపడుతున్నాడు. వచ్చిన సంబంధాలను కూడా తిరస్కరిస్తున్నారని డిప్రెషన్‌కు గురైన గురునారాయణ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల తరువాత తండ్రిని బహిర్భూమికి తోడుగా తీసుకునివెళ్లి గొంతుకోశాడు.

రక్తం మడుగులో భద్రాచారి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అనంతరం గురునారాయణ అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా కేకలు విని గ్రామస్తులు బయటకు వచ్చారు. జరిగిన సంఘటనను చూసి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. తన కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదని లక్ష్మీ కాంతమ్మ భర్త మృతదేహాన్ని పట్టుకుని విలపించింది. కాగా గురునారాయణకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్‌పీ వీరరాఘవరెడ్డి, మార్కాపురం ఇన్‌చార్జి సీఐ రాజేష్‌ తదితరులు పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement