జననీ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవంటారు. ఇంకా చెప్పాలంటే కన్నతల్లి కంటే కూడా ఆ తల్లిని కన్నభూమి ఎంతో గొప్పదంటారు. అందుకేనేమో.. పరాయిదేశంలో పెరిగినా, చివరికి ఈ మట్టిలోనే కలిసిపోవాలనకుంటారు. 80 ఏళ్ల నందకిశోర్ కూడా ఇదే చెబుతున్నాడు. భారతీయుడిగానే మరణించాలని ఉందంటున్నాడు.
1946 సంవత్సరం... భారత్, పాక్ అప్పటికింకా విడిపోలేదు. యూపీలోని దేవరియా ప్రాంతంలో, ఓ నిరు పేద కుటుంబంలో నందకిశోర్ జన్మించారు. కుటుంబం గడవడం కష్టమవుతుండగటంతో నందకిశోర్‌ను అతని తల్లి ఓ ఇంట్లో పని కోసం కరాచీ (కరాచీ అప్పటికి భారత్‌లోనే ఉంది) పంపించారు. అప్పుడు అతని వయసు 8 ఏళ్లు. వెళ్లిన ఏడాదికే భారత్, పాక్ విడిపోయాయి. కాగా నందకిశోర్‌ను పనికి కుదుర్చుకున్న యజమాని..అతని పేరును హస్మత్ అలీగా మార్చాడు. ఆ తర్వాత హస్మత్ అలీగా అక్కడే పౌరసత్వం పొందాడు.
19 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థానీ పాస్‌పోర్టుతో, హస్మత్ పేరుతో నందకిశోర్ భారత్ కు తిరిగొచ్చాడు. అయితే వీసా గడువు ముగియడంతో 1974 నుంచి 1998 మధ్య హస్మత్ అలీ వీసా గడువును సంవత్సరానికొకసారి పొడిగించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. 1998 తర్వాత అతని వీసా గడువు పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇక వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఓసారి అధికారులు అత్తారీ సరిహద్దు వరకూ తీసుకెళ్లారు. అయితే అప్పటి విదేశాంగ మంత్రి జోక్యంతో తిరిగి మళ్లీ వెనక్కివచ్చాడు.
భారతీయుడిగానే చనిపోతా..
ఇంత జరుగుతున్నా నందకిశోర్ మాత్రం ఇండియాను వదిలిపెట్టేందుకు మాత్రం ససేమిరా అంటున్నాడు. 2008లో నందకిశోర్ కేసును ప్రభుత్వానికి బదిలీచేశారు. కేసుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం గతంలో ఇప్పటికే పలుసార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ తనకు మాత్రం పాక్ వెళ్లడం ఇష్టం లేదని.. ఓ భారతీయుడిగానే చనిపోవాలని కోరుకుంటున్నట్లు తెగేసి చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment