
బెగుసరాయి : కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి సైతం సై అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బీహార్‌కు చెందిన ఓ తాంత్రికుడు. తన కొడుకు బలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించాడు.
వివరాలు.. బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్‌పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్, ఇంజినీర్ అయిన తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖ, సురేంద్ర ప్రసాద్ ఓ విలేకరితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియో సురేంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘ నరబలి నేరం కాదు. ఇంజనీర్ అయిన నా కొడుకును మా ఆరాధ్య దేవత అయిన కామాఖ్యదేవికి బలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా మొదటి నరబలి. నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు రావణాసూరుడు లాంటి వాడు. నరబలికి అనుమతి ఇవ్వండి’ అంటూ అధికారులకు విన్నవించాడు.
అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా సురేంద్రప్రసాద్ సింగ్ ఓ పిచ్చోడని, ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment