సాక్షి, ముంబై : సినీనటి శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే ఓ అభిమాని (జతిన్ వాల్మీకి) ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. నటికి కడసారి వీడ్కోలు పలకాలని గత మూడు రోజులుగా శ్రీదేవి ఇంటి వద్ద ఎదురుచూస్తున్న ఆ అభిమాని అంధుడు. కానీ ఆమెను నటిగా కంటే కూడా ఓ మంచి మనసున్న వ్యక్తిగా అభిమానిస్తున్నట్లు పేర్కొన్నాడు.
శ్రీదేవి అభిమాని జతిన్ వాల్మీకి ఏఎన్‌ఐతో మాట్లాడారు. ‘నేను అంధుడిని. అందుకే శ్రీదేవిని, ఆమె సినిమాలను చూడలేకపోయాను. కానీ ఆమె మంచితనాన్ని మాత్రం చూశాను. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటిని కలుసుకున్నాను. నా సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని సాయం చేయాలని కోరగా శ్రీదేవి ఏమాత్రం ఆలోచించకుండా రూ.1 లక్ష చెక్ ఇచ్చారు. నటి సాయం తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం ట్రీట్‌మెంట్ ఫీజులో లక్ష తగ్గించారు. ఆమె కారణంగానే నేడు నా సోదరుడు ప్రాణాలతో ఉన్నాడు. అందుకే ఆ గొప్పవ్యక్తి ఇకలేరని తెలియగానే కడసారి వీడ్కోలు పలికేందుకు యూపీ నుంచి ముంబైకి వచ్చాను. అంతకుమించి నేను ఏం చేయలేనంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, బుధవారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు అభిమానులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచుతారు. నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లె సేవా సమాజ్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment