కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ
న్యూఢిల్లీ : కథువా అత్యాచార ఉదతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా ప్రాంతానికి చెందిన అసిఫా(8)కి మాదకద్రవ్యాలు ఇచ్చి నాలుగు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు.
బాలలపై అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. ఈ మేరకు బాలలపై లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం(పీఓఎస్‌సీఓ)ను సవరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి మరణ దండన విధించాలనే నిబంధనను నోట్‌గా కేబినేట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు.
ఈ మేరకు ఓ వీడియోను మేనకా గాంధీ విడుదల చేశారు. కథువా లాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ దండనే సరైన శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment