
మోదీ ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్రమోదీ నేటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసక్తికర ఉదాహరణలతో విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. మోదీతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
మోదీ ఏం మాట్లాడారంటే..
- నాకు తెలుసు మీరంతా మీ పిల్లల పరీక్షల గురించి కంగారు పడుతున్నారని, మీతోపాటు నేను కూడా విద్యార్థుల పరీక్షల విషయంలో కొంత ఆందోళనతోనే ఉన్నాను.
- ఈ 20 నిముషాలు నేను మాట్లాడబోతున్న విషయాలు విద్యార్థులుకు తప్పక ఉపయోగపడతాయని భావిస్తున్నాను.
- పరీక్షలంటే మొత్తంగా మార్కులకు సంబంధించినవి కావు, ప్రతి పరీక్ష గొప్ప ప్రయోజనానికి దారి మాత్రమే.
- ఈ పరీక్షలతోనే మీకు మీరు హద్దులు ఏర్పరుచుకోకండి, గొప్ప గొప్ప ప్రయోజనాలపై దృష్టి పెట్టండి.
- తగిన విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు పడుకునేముందు ఎక్కువ సమయం ఫోన్ లో సంభాషించటం మనకు అలవాటుగా మారిపోయింది. అంతసేపు మన కలతల గురించి మాట్లాడాక ఇక ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుంది? అందుకే మనం ఆ అలవాటుని అధిగమించాలి.
- క్రమశిక్షణే జీవితంలో విజయానికి పునాది అవుతుంది.
- టెన్షన్ కి లోనుకాకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో పరీక్షలు రాయండి, మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి.
- జె.కె.రోలింగ్ మనందరికీ మంచి ఉదాహరణ. ఎవరైనా ఏ సమయంలోనైనా ఏదైనా సాధించగలరని ఆమె నిరూపించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆమె విజయం సాధించారు.
- ఉత్సుకత అనేది ఆవిష్కరణలకు తల్లి వంటిది. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితోనే ఆవిష్కరణలు సాధ్యం. 'నేషనల్ సైన్స్ డే' రోజున శాస్త్ర, సాంకేతిక రంగాలను మన జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా గుర్తిద్దాం. ఈ సందర్భంగా నేను సర్ సివి రామన్ కు ప్రణమిల్లుతున్నాను. అలాగే శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
- దేశ ప్రజలు రేపు ఆర్థిక బడ్జెట్ తో నన్ను పరీక్షించనున్నారు, నా పరీక్షతోపాటు మీ పరీక్షలు సఫలమవుతాయని ఆశిస్తున్నాను.
- తల్లిందండ్రులు, ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగిన సపోర్ట్ అందించండి. వారి విజయంలో మీరూ భాగస్వాములు కండి.
సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..
- రిలాక్స్డ్గా ఉండండి, మీ టార్గెట్ ను మీరే నిర్దేశించుకుని.. సాధించేందుకు ప్రయత్నించండి. నేను ఆడుతున్నప్పుడు నా మీద ఎందరికో భారీ అంచనాలుండేవి, కానీ నా టార్గెట్ ను నేనే నిర్దేశించుకునేవాడిని.
- ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధంకండి. మీకు మీరే పోటీగా భావించాలి తప్ప, పక్కవారితో పోల్చుకోకూడదు.
- మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉండే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి.. గుడ్ లక్.
విశ్వనాధన్ ఆనంద్ ఏమన్నారంటే..
- మౌనంగా ఉండండి, మంచి ఆహారం, తగినంత నిద్ర తప్పనిసరి.
- భారీ అంచనాలు విపరీతమైన ఒత్తిడికి దారితీస్తాయి, కాబట్టి మరీ భారీ అంచనాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
- ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు, అలా అని నిరాశావాదులుగా కూడా ఉండొద్దు. కేవలం ఒక చాలెంజ్ గా మాత్రమే తీసుకోండి.
గురు మోరారీ బాపూ..
- ప్రశాంతంగా ఉండండి, విజయం వెంట పరుగులు తీయాల్సిన పని లేదు.. పరిస్థితిని అంగీకరిస్తే చాలు.
- అందరూ విజయాలే అందుకోవాల్సిన అవసరం లేదు, అపజయాలతో కూడా సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. మీకు నా ఆశీస్సులు.
ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు
- నాకు తెలుసు.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎంతటి యాంగ్జైటీకి గురవుతారో, ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల విషయంలో.. కానీ దిగులు పడొద్దు.. మీరే విజేతలు.
- దేశంలో ఎన్నెన్నో అవకాశాలున్నాయి. మీరేం చేయాలనుకుంటున్నారనేది మీరే ఆలోచించుకోండి.. డోన్ట్ గివ్ ఇట్ అప్.
ఇంకా మోదీ మాట్లాడుతూ తనతోపాటు విద్యార్థులకు విలువైన సూచనలు అందించిన సచిన్ టెండూల్కర్, విశ్వనాధన్ ఆనంద్, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, మోరారీ బాపూలకు ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ డే సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.