
అధికారులతో అమరీందర్ సింగ్ భేటీ
చండీగఢ్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడంతో హరియణా, పంజాబ్ ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చండీగఢ్‌లోని తన నివాసంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు, మంత్రులతో చర్చించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు అవకాశం ఇవ్వరాదని ఖట్టర్ ఆదేశించారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని అమరీందర్ సింగ్ తెలిపారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు కోర్టు విధించిన శిక్షను ప్రజలు ఆమోదించాలని, శాంతిని కాపాడాలని ఆయన కోరారు. మరోవైపు రోహతక్‌లోని సునారియా జైలు పరిసరాల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు.
కాగా, హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛా సౌదా మద్దతుదారులు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మరిన్ని విధ్వంసాలకు పాల్పడకుండా చూసేందుకు సైనిక దళాలు సిర్సాలో కవాతు నిర్వహించాయి.