మావోయిస్టుల బంద్ ప్రశాంతం
- ఊపిరిపీల్చుకున్న పోలీసులు..
- ఏజెన్సీల్లో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు
- ఇబ్బందులు పడిన ప్రయాణికులు
- స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
సాక్షి, విశాఖపట్నం/రంపచోడవరం/అమరావతి/ఏలూరు/రాయగడ: 30 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గురువారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మారుమూల ప్రాంతాలు, అంతర్రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
పోలీసులు దగ్గరుండి వాటిని తెరిపించే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశామని, రూ. 25 లక్షల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే విశాఖ జిల్లా నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే సర్వీసులు నిలిపేశారు. పాడేరు, చింతపల్లి, అరకు, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, కొత్తూరు, సీతంపేట, పలాస ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లోనూ బస్సు సర్వీసులు రద్దు చేశారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ రహదారి నిర్మానుష్యంగా మారింది. విజయవాడ, రాజ మండ్రి, రావులపాలెం, కాకినాడ, భద్రాచలం తదితర డిపోల నుంచి కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. బంద్ ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో కనిపించలేదు.
మావోలు చంపారంటూ వదంతులు...
విశాఖలోని కొయ్యూరు మండలానికి చెందిన సర్పంచ్‌ను మావోయిస్టులు చంపేశారంటూ గురువారం వదంతులు వచ్చా యి. కొండగోకిరి మాజీ సర్పంచ్ ఒకరు అనారోగ్యంతో మరణిస్తే దానినే మరో విధంగా సృష్టించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాలను మోహరించడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేశారు.
మందుపాతర పేలి పోలీస్ జాగిలానికి గాయాలు
మావోరుుస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీస్ జాగిలం గాయాలపాలైంది. ఒడిశాలోని రాయగడ జిల్లా హటొమునిగుడ రహదారి పక్కన మావోరుుస్టులు మందుపాతర్లు అమర్చారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో జాగిలాలతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మందుపాతర్లను గుర్తిస్తున్న జాగిలాల్లో ఒక జాగిలం కాళ్లు మందుపాతరకు తగిలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన జాగిలానికి చికిత్స అందిస్తున్నారు. కాగా, జాగిలాలు గుర్తించిన మూడు మందుపాతర్లలో ఒకటి పేలిపోగా, మరో రెండింటిని సీఆర్‌పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు. పోలీసులే లక్ష్యంగా వంశధార, గుమ్సరా, నాగావళి డివిజన్ కు చెందిన మావోలు వీటిని అమర్చి ఉండవచ్చని భావిస్తున్నారు.