న్యాయవ్యవస్థలో అవినీతిపై జస్టిస్ కట్జు ధ్వజం
న్యాయవ్యవస్థలో అవినీతికి అడ్డులేకుండా పోతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మండిపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అయిన ఆయన.. సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై కూడా ఆరోపణాస్త్రాలు సంధించారు. యూపీఏ ప్రభుత్వం చెప్పడంతో మద్రాసు హైకోర్టులో ఓ అదనపు జడ్జికి పదవీకాలం పొడిగించారని ఆయన ఆరోపించారు. తమిళనాడులోని ఓ ప్రాంతీయ పార్టీ చెప్పడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన అన్నారు. జస్టిస్ ఆర్సీ లహోటీ, జస్టిస్ వైకే సభర్వాల్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్.. ఈ ముగ్గురూ కూడా బోలెడన్ని ఆరోపణలున్న అదనపు జడ్జిని కొనసాగించారని జస్టిస్ కట్జు ఆరోపించారు.
ఈ వ్యవహారాన్ని జస్టిస్ లహోటి ప్రారంభించగా ఆ తర్వాత జస్టిస్ సభర్వాల్, జస్టిస్ బాలకృష్ణన్ కొనసాగించారని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిడికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లొంగిపోతారా అంటూ కట్జు ప్రశ్నించారు. అదనపు జడ్జి మీద బో్లెడన్ని ఆరోపణలున్నాయని, వాటిపై తన ఫిర్యాదు మేరకు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లహోటి రహస్యంగా ఐబీ విచారణ కూడా జరిపించారని కట్జు తెలిపారు. అందులో ఆరోపణలు నిజమని తేలినప్పుడు.. ఆయన్ని తీసేయాల్సింది పోయి.. ఇంకా చాలా కాలం పాటు కొనసాగించడంతో తాను దిగ్భ్రాంతి చెందానన్నారు.
తమిళనాడులోని ఒక ప్రాంతీయ పార్టీ మీద యూపీఏ-1 ప్రభుత్వం ఆధారపడి ఉండటమే దీనంతటికీ కారణమని తనకు తెలిసినట్లు కట్జు చెప్పారు. ఆ పార్టీ నాయకుడికి అదనపు జడ్జి ఒకసారి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావడం వల్లే ఇదంతా జరిగిందన్నారు.