లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. యూపీలో కాంగ్రెస్‌ను దూరం పెడుతూ బీఎస్పీ-ఎస్పీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రాతినిథ్యం వహించే అమేథి, రాయ్‌బరేలి స్ధానాలను మాత్రం ఆ పార్టీకి బీఎస్పీ-ఎస్పీలు విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు మహాకూటమి ప్రయత్నాలకు బీఎస్పీ-ఎస్పీల పొత్తు తూట్లు పొడిచింది. సీట్ల సర్ధుబాటులో భాగంగా యూపీలో బీఎస్పీ 38 స్ధానాలు, ఎస్పీ 37 స్ధానాల్లో పోటీ చేస్తాయి. మూడు సీట్లను ఆర్‌ఎల్డీకి కేటాయించారు. యూపీలో కాంగ్రెస్‌ను దూరం పెట్టిన క్రమంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని బెహన్ తేల్చిచెప్పారు.
మూడుకు పైగా రాష్ట్రాల్లో ఉనికి చాటుకున్న బీఎస్‌పీని ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీగా గుర్తించింది. యూపీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్ సహా మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్ధిష్ట ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన బీఎస్పీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దూరం జరగడం ప్రధాన విపక్షానికి ఇబ్బందికరమైన పరిణామమేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment