సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. మహిళల భద్రతపట్ల కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని వెల్లడించారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ‘షీ బాక్స్’ ఫిర్యాదుల వ్యవస్థ గురించి తెలిపారు. ఇకపై మహిళలు తమపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారం గురించైనా క్షణాల్లో తమ దృష్టికి తీసుకురావొచ్చని అన్నారు. షీ బాక్స్ ఆన్‌లైన్ వేదిక ద్వారా వేధింపులకు గురైన మహిళలు క్షణాల్లో ఫిర్యాదు చేసి రక్షణ పొందొచ్చని వివరించారు.
ఇదిలా ఉండగా.. మన దేశంలో కూడా ‘మీటూ’ వంటి ఉద్యమం మొదలవ్వాలనే మేనకా గాంధీ పిలుపపై తనుశ్రీ స్పందించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పడంతో కెరీర్ అంధకారంలో పడింది. అయినా, దేనికీ వెరవకుండా నా బాధను ప్రపంచానికి తెలియజేశా. కానీ, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ‘పెద్ద మనుషులు’ దర్జాగా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న దేశంలో మీటూ వంటి ఉద్యమాలు పురుడు పోసుకోలేవని అన్నారు.
పెరిగిన మద్దతు..
2008లో ‘హర్న్ ఓకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేసే క్రమంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తీవ్ర విమర్శలు చేయడం సంచలనం రేపింది. నానా వేధింపులపై నోరు విప్పినందుకే తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2010 వచ్చిన ‘జగ్ ముంద్రా అపార్ట్‌మెంట్’లో తనుశ్రీ చివరగా నటించారు. దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై కూడా తనుశ్రీ ఆరోపణలు చేశారు. కాగా, బాలీవుడ్ ప్రముఖులు ఫరాఖాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, అనురాగ్ కశ్యప్, రేణుక షహానే తను శ్రీకి మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment