మీడియా మోడీకి అమ్ముడుపోయింది.
అధికారంలోకి వస్తే అందరినీ జైలుకు పంపుతాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ‘‘మీడియా మొత్తం అమ్ముడుపోయింది.. ఇదంతా పెద్ద రాజకీయ కుట్ర.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. దీనిపై దర్యాప్తు చేయిస్తాం.. మీడియా జనంతో పాటు అందరినీ జైలుకు పంపిస్తాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రచారం చేయటానికి మీడియాకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఆరోపించారు.
కేజ్రీవాల్ గురువారం రాత్రి నాగ్‌పూర్‌లో ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘ఏడాది కాలంగా.. మోడీ ఇక్కడ ఉన్నారు.. మోడీ అక్కడ ఉన్నారు.. అని మనకు చెప్తూ ఉన్నారు. ఏడాదిగా మోడీ కూడా ఇదే చెప్తున్నారు. చివరికి కొన్ని టీవీ చానళ్లు కూడా ‘రామరాజ్యం’ వచ్చిం దని, అవినీతి మాయమైపోయింది చెప్తున్నాయి. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే టీవీ చానళ్లకు డబ్బులు చెల్లించటం జరిగింది. మోడీకి అనుకూలంగా ప్రచారం చేయటానికి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయి.
గుజరాత్‌లో గత పదేళ్లలో దాదాపు 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ టీవీ చానళ్లలో ఒక్కటి కూడా దీనిని చూపలేదు. రైతులు తమ భూమిని ఒక సంస్థకు కేవలం ఒక్క రూపాయికే అమ్మారు. దీనిని కూడా ఏ మీడియా చానల్ చూపించలేదు’’ అంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ.. కేజ్రీవాల్ శుక్రవారం కూడా మోడీపై, మీడియాపై విమర్శలు గుప్పించారు. గుజరాత్ అభివృద్ధి చెందిందంటూ మీడియాలోని ఒక భాగం ఒక కథనం అల్లుతోందని.. ఆ నమూనా అభివృద్ధిని చూపుతూ నరేంద్ర మోడీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు జరిగిన రాజకీయ కుట్ర ఇదని ఆయన నాగ్‌పూర్‌లో ధ్వజమెత్తారు.
మహారాష్ట్రలో మూడు రోజుల రోడ్ షో ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్ల మచ్చను మోడీ ఎలా చెరుపుకుంటారని ప్రశ్నించారు. అయితే.. మీడియాను కించపరిచేలా తాను మాట్లాడలేదని ఆయన మరో సందర్భంలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ మీడియాలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి మాత్రమే పై ఆరోపణలు చేశారని ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ విలేకరుల సమావేశంలో సమర్థించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆప్ నేతలకు, మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
నియంతృత్వ పోకడ.. బీజేపీ ధ్వజం:
మీడియా మొత్తం మోడీకి అమ్ముడుపోయిందని, మీడియా జనాన్ని జైలులో పెడతానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించటం.. నియంతృత్వ పోకడ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ స్పందించారు. కేజ్రీవాల్, ఆయన సహచరులు పట్టణ ప్రాంతంలో మావోయిస్టులని వెల్లడైందని అభివర్ణించారు. ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని, ఆయన రాహుల్ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని, మోడీనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్‌ను మీడియా రాత్రికిరాత్రి హీరోను చేసిందని.. ఆయన ఇప్పుడు అదే మీడియాను జైలుకు పంపుతానంటున్నారని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఆప్‌కు నిధులెక్కడి నుంచి వస్తున్నాయన్నారు.
పాలన నుంచే పారిపోయారు.. కాంగ్రెస్ ఎద్దేవా:
కేజ్రీవాల్ పరిపాలన నుంచే పారిపోయారని కాంగ్రెస్ నేత కపిల్‌సిబల్ విమర్శించారు. మీడియాను ఆయన ఏమీ చేయజాలరని.. ఎందుకంటే మీడియా సమర్థవంతమైనదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఇటీవలి కాలంలో అతిశయోక్తులతో ప్రకటనలు చేస్తున్నారని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు.
బాధ్యతా రాహిత్యం.. బీఈఏ:
మీడియాపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని ప్రసార సంపాదకుల సంఘం(బీఈఏ) ఖండించింది. మీడియా విశ్వసనీయతను మసకబార్చటమే ఈ అస్పష్ట ఆరోపణల లక్ష్యమని విమర్శించింది.