ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత వ్యక్తిని బరిలోకి దింపి ప్రతిపక్షాలను సందిగ్ధంలో పడేసిన బీజేపీకి...విపక్షాలు కూడా దీటుగా సమాధానం ఇచ్చాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ప్రతిపక్షాలు ఎంపిక చేశారు. గురువారం సాయంత్రం సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో ఎన్నికల్లో తలపడనున్నారు.
మీరా కుమార్ ఈ నెల 27 లేదా 28వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. విపక్షాల భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...మీరా కుమార్‌కు 17 పార్టీల మద్దతు ఉందని తెలిపారు. సైద్ధాంతికంగానే మీరా కుమార్ పోటీ చేస్తున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆమె నామినేషన్ పై ప్రతిపక్షాలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి.
బిహార్ రాష్ట్రం పట్నాకు చెందినమీరా కుమార్.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కుమార్తె. ఆమె అయిదుసార్లు ఎంపీగా పని చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అలాగే 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరి మీరా కుమార్ దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. ఆమె1985లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. కాగా యూపీఏ హయాంలో ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతిగా పని చేసిన విషయం తెలిసిందే.