మరుపురాని వివాహం! | Memorable wedding | Sakshi
Sakshi News home page

మరుపురాని వివాహం!

Published Thu, Oct 30 2014 9:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

హెలికాప్టర్ ముందు వధూవరులు భానుప్రియ, గౌతమన్

హెలికాప్టర్ ముందు వధూవరులు భానుప్రియ, గౌతమన్

 చెన్నై : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక మరుపురాని ఘట్టం. అటువంటి రోజును మరిచిపోలేని విధంగా జరుపుకోవాలని తమిళనాడుకు చెందిన ఓ పెళ్లి కుమారుడికి వచ్చిన ఆలోచన పెళ్లి కుమార్తెను మురిపింపజేసింది.  బంధువులను మైమరపింపజేసింది.
 శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఎస్‌ఆర్ పట్టినంకు చెందిన గౌతమన్ ఫ్రాన్స్‌లోని ఒక న్యాయస్థానంలో న్యాయసలహాదారుగా పనిచేస్తున్నారు. పుదుక్కోటైట్ జిల్లా అరంతాంగి సమీపం కూలమంగళం గ్రామానికి చెందిన భానుప్రియతో అక్టోబర్ 30న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వివాహాన్ని పెద్ద వేడుకగా మార్చాలని పెళ్లి కుమారుడు భావించారు.

సొంత ఊరి ప్రజలు తన పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోకూడదని నిర్ణయించుకున్నారు.  నిశ్చితార్థం కోసం 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించి బెంగళూరు నుంచి తన గ్రామానికి హెలికాఫ్టర్ను తెప్పించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి హెలికాప్టర్‌లో బుధవారం సాయంత్రం పెళ్లి కుమార్తె గ్రామంలో మామగారు సిద్దం చేసి ఉన్న హెలిపాడ్‌లో దిగాడు. నిశ్చితార్థం ముగించుకుని అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తెతో సహా అదే హెలికాప్టర్‌లో తన గ్రామానికి చేరుకున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు వరుని స్వగ్రామమైన ఎస్‌ఆర్ పట్టినంలో కల్యాణముహూర్తం సమీపిస్తోంది. అదే సమయంలో వంద కిలోల పూలతో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ మళ్లీ ఆకాశంలోకి రివ్వున లేచింది. వధువు మెడలో వరుడు మాంగల్యధారణ చేస్తుండగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసింది. వివాహ తంతు ముగిసిన తరువాత వధూవరులిద్దరూ హెలికాప్టర్ ఎక్కి సుమారు గంటపాటు గ్రామంపై చక్కర్లు కొట్టారు.

పెళ్లి వేడుకకు హాజరైన వారిని ఆకాశం నుంచే పలకరించారు. గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా వారిని చూశారు. అంతేకాదు పెళ్లిపెద్దలలోని ముఖ్యులకు హెలికాప్టర్‌లో కొద్దిసేపు విహరించే అవకాశం కూడా కల్పించారు. ఇంతవరకు విమాన ప్రయాణమే ఎరుగని తాను పెళ్లి సందర్భంగా హెలికాప్టర్‌లో ఎగురుతానని ఊహించలేదని పెళ్లి కుమార్తె భానుప్రియ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆకాశంలో దూరంగా  విమానాన్ని చూస్తూ అబ్బురపడే వధూవరుల గ్రామాల్లోకి హెలికాప్టర్ దిగడంతో ప్రజలు సంబరపడిపోయారు. గౌతమన్  అనుకున్నట్లే తన వివాహం తనకు, గ్రామస్తులకు  ఒక మరుపురాని ఘట్టంగా నిలిచింది.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement