ఎంతపని చేశావు పెళ్లికొడుకా!
షాంఘై: కాబోయే భార్యను ఇంప్రెస్ చేద్దామని ఓ పెళ్లికొడుకు చేసిన ప్రయత్నం సామాన్యుల పాలిట శాపంగా మారింది. పోలీసులు తిట్లు తినే, అధికారుల ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి దాపురించింది. చైనీస్ మహానగరం షాంఘైలోని నాన్ యువాన్ రోడ్డు మామూలుగానే రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డు పక్క సందులోని ఓ ఇంట్లో ఓ యువతి నివసిస్తోంది. బాగా డబ్బులున్న యువకిణ్ని ఆమె ప్రేమించింది. పెద్దల అంగీకారంతో జులై 24న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబోయే పెళ్లానికి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న పెళ్లికొడుకు ఆమెను వివాహ వేదిక దగ్గరికి తీసుకుపోయేందుకు కారులో కాకుండా హెలికాప్టర్ లో వచ్చాడు. అప్పుడు మొదలయ్యాయి జనం కష్టాలు!
సరాసరి రోడ్డు మధ్యలో హెలికాప్టర్ ను ల్యాండ్ చేసి, దాదాపు గంట సేపు(పెళ్లి కూతురు రెడీ అయ్యేంతవరకు) అక్కడే నిలిపారు. ఐదు, దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది వాహనదారులు ఏం జరుగుతుందో అర్థంకాక ఇబ్బంది పడ్డారు. తీరా విషయం తెలిశాక పోలీసులను తిట్టిపోసి, సంబంధిత అధికారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఉన్నప్పటికీ, రద్దీగా ఉండే రోడ్లపై హెలికాప్టర్లు ల్యాండ్ చేయడం నేరమని ఏవియేషన్ అధికారులు అంటున్నారు.