Gowtaman
-
చెన్నై టు ముంబయ్ వయా హైదరాబాద్!
మణిరత్నం, గౌతమ్ మీనన్... ఇద్దరూ ఇద్దరే! ఎలాంటి కథతోనైనా, ఏ నేపథ్యంలోనైనా సిన్మాలు తీయగల సత్తా ఉన్న దర్శకులు. ‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ... ఒక్క సిన్మాతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలననే నమ్మకం కలిగించిన నటుడు. ఇప్పుడీ హీరోపై ఈ దర్శకులిద్దరి కన్ను పడిందట! విజయ్‌తో సినిమాలు తీయాలని మణిరత్నం, గౌతమ్‌మీనన్ కథలు రెడీ చేస్తున్నారట! ఆల్రెడీ చెన్నైలో ఆ ఇద్దరితో వేర్వేరుగా ఈ హీరో కలిశారని కోడంబాక్కమ్ వర్గాల సమాచారమ్. ఓ పక్కన తమిళ దర్శకులు విజయ్ కోసంప్రయత్నిస్తుంటే... ముంబయ్ నుంచి కూడా ఈ హీరోకి కబురొచ్చిందట! ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, దర్శకుడు బిజోయ్ నంబియార్ తదితరులు విజయ్‌తో డిస్కషన్స్ చేస్తున్నారట! సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మకి కూడా విజయ్‌తో ఓసినిమా తీయాలనుందట! వీళ్లిద్దరూ ముంబయ్‌లో ఓసారి కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో విజయ్ నటిస్తున్నారు. మరి, ఈ బిజీ షెడ్యూల్లో నెక్ట్స్ సిన్మా ఎవరికి కమిట్ అవుతారో? వెయిట్ అండ్ సీ!! -
మరుపురాని వివాహం!
చెన్నై : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక మరుపురాని ఘట్టం. అటువంటి రోజును మరిచిపోలేని విధంగా జరుపుకోవాలని తమిళనాడుకు చెందిన ఓ పెళ్లి కుమారుడికి వచ్చిన ఆలోచన పెళ్లి కుమార్తెను మురిపింపజేసింది. బంధువులను మైమరపింపజేసింది. శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఎస్ఆర్ పట్టినంకు చెందిన గౌతమన్ ఫ్రాన్స్‌లోని ఒక న్యాయస్థానంలో న్యాయసలహాదారుగా పనిచేస్తున్నారు. పుదుక్కోటైట్ జిల్లా అరంతాంగి సమీపం కూలమంగళం గ్రామానికి చెందిన భానుప్రియతో అక్టోబర్ 30న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వివాహాన్ని పెద్ద వేడుకగా మార్చాలని పెళ్లి కుమారుడు భావించారు. సొంత ఊరి ప్రజలు తన పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోకూడదని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం కోసం 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించి బెంగళూరు నుంచి తన గ్రామానికి హెలికాఫ్టర్‌ను తెప్పించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి హెలికాప్టర్లో బుధవారం సాయంత్రం పెళ్లి కుమార్తె గ్రామంలో మామగారు సిద్దం చేసి ఉన్న హెలిపాడ్‌లో దిగాడు. నిశ్చితార్థం ముగించుకుని అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తెతో సహా అదే హెలికాప్టర్లో తన గ్రామానికి చేరుకున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు వరుని స్వగ్రామమైన ఎస్ఆర్ పట్టినంలో కల్యాణముహూర్తం సమీపిస్తోంది. అదే సమయంలో వంద కిలోల పూలతో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ మళ్లీ ఆకాశంలోకి రివ్వున లేచింది. వధువు మెడలో వరుడు మాంగల్యధారణ చేస్తుండగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసింది. వివాహ తంతు ముగిసిన తరువాత వధూవరులిద్దరూ హెలికాప్టర్ ఎక్కి సుమారు గంటపాటు గ్రామంపై చక్కర్లు కొట్టారు. పెళ్లి వేడుకకు హాజరైన వారిని ఆకాశం నుంచే పలకరించారు. గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా వారిని చూశారు. అంతేకాదు పెళ్లిపెద్దలలోని ముఖ్యులకు హెలికాప్టర్లో కొద్దిసేపు విహరించే అవకాశం కూడా కల్పించారు. ఇంతవరకు విమాన ప్రయాణమే ఎరుగని తాను పెళ్లి సందర్భంగా హెలికాప్టర్లో ఎగురుతానని ఊహించలేదని పెళ్లి కుమార్తె భానుప్రియ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆకాశంలో దూరంగా విమానాన్ని చూస్తూ అబ్బురపడే వధూవరుల గ్రామాల్లోకి హెలికాప్టర్ దిగడంతో ప్రజలు సంబరపడిపోయారు. గౌతమన్ అనుకున్నట్లే తన వివాహం తనకు, గ్రామస్తులకు ఒక మరుపురాని ఘట్టంగా నిలిచింది. **