
ఉగ్రవాదుల కదలిక, ముంబయిలో హై అలర్ట్
ముంబయి: ముంబైలో నేవీ అధికారులు గురువారం హై అలర్ట్ ప్రకటించారు. నేవీ బేస్ వద్ద దుండగులు ఆయుధాలతో సంచరిస్తున్న సమాచారం నేపథ్యంలో నేవీ అప్రమత్తం అయింది. ముంబై సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నల్ల దుస్తులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ డిలీప్ సావంత్ మాట్లాడుతూ గాలింపు చర్యలు చేపట్టామని, ఇప్పటివరకూ ఎలాంటి అనుమానస్పద సమాచారం లేదన్నారు. మరోవైపు ముంబై పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అప్రమత్తం అయింది.
కాగా అక్కడ మీడియా చానల్స్ కథనం ప్రకారం ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో నలుగురు లేదా అయిదుగురు వ్యక్తలు సైనిక దుస్తులు ధరించి ఉరాన్ ప్రాంతంలోకి వచ్చినట్లు కథనాలు ప్రసారం చేశాయి. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.