ప్రాణాల కోసం పరిగెత్తినా.. కారు గాల్లోకి లేపింది! | Mercedes Hit And Run On Camera, 32 Year old Ran But Could not Get Away | Sakshi
Sakshi News home page

ప్రాణాల కోసం పరిగెత్తినా.. కారు గాల్లోకి లేపింది!

Published Thu, Apr 7 2016 9:35 AM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

ప్రాణాల కోసం పరిగెత్తినా.. కారు గాల్లోకి లేపింది! - Sakshi

ప్రాణాల కోసం పరిగెత్తినా.. కారు గాల్లోకి లేపింది!

న్యూఢిల్లీ: ముప్పై రెండేళ్ల సిద్ధార్థ శర్మ అప్పుడు న్యూడిల్స్ పార్శిల్ కట్టించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రోడ్డు దాటేందుకు అటు-ఇటు చూసి అడుగు ముందుకేశాడు. ఎదురుగా 100 కిలోమీటర్ల వేగంగా మెర్సిడెస్ కారు దూసుకొస్తుంది. తనను చూసి కూడా కారు డ్రైవర్ స్పీడ్‌ తగ్గించలేదు. తన మీదకొస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు సిద్ధార్థ వెంటనే పరుగులు పెట్టాడు.

అయినా ఫలితం లేకపోయింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టి.. అమాంతం గాల్లోకి లేపేసింది. ఆయనను ప్రమాదం నుంచి తప్పించడానికి ఆ కారులోని కుర్ర డ్రైవర్‌ ప్రయత్నించలేదు. ఢీకొట్టిన తర్వాత కూడా కారు స్లో చేయలేదు. అంతే వేగంగా పేవ్‌మెంట్‌ మీదకు దూసుకుపోయాడు. కారు ముందు టైరు పగిలిపోవడంతో ఆగిపోయింది. లేకుంటే మరింత విధ్వంసం సృష్టించేదే.

అమాంతం గాలిలోకి లేచిన సిద్ధార్థ శరీరం.. నిర్జీవమై రోడ్డుపై పడింది. ఆయన న్యూడిల్ పార్సిల్ ఉన్న బ్యాగు దూరంగా పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్లు అయ్యో అంటూ అతని మృతదేహం చుట్టూ మూగారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సీసీటీవీ దృశ్యాలు ఇవి. ఓ సంపన్నుడి మైనర్‌ కొడుకు కన్నుమిన్నుకానని వేగంతో మెర్సిడెస్ కారును నడుపుతూ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు.

ఇంటర్ పరీక్షలు ముగిశాయన్న ఆనందంతో కారులో స్నేహితులతో జల్సా చేస్తూ.. అదుపులేని వేగంతో ఈ ప్రమాదానికి ఒడిగట్టి.. ఆ వెంటనే సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో సంపన్నుడైన అతని తండ్రిపై అభియోగాలు మోపారు. మైనర్‌కు వాహనం ఇచ్చి ప్రమాదానికి కారణమైనట్టు బెయిలబుల్ అభియోగాన్ని మాత్రమే అతనిపై పెట్టారు.

ఈ ప్రమాదంలో తన ఒక్కగాను ఒక్క కొడుకును కోల్పోయిన హేమ్‌రాజ్ శర్మ మాత్రం పోలీసుల విచారణ ఓ జోక్‌లా కనిపిస్తోందని, పోలీసుల తీరు ప్రశార్థకంగా ఉందని అంటున్నారు. సంపన్నుడైన నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నేరగాళ్లకు శిక్ష విధించకుంటే రేపొద్దున మీ కుటుంబాలకు తన కుటుంబానికి వచ్చిన పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement