భోపాల్ : కరోనా నేపథ్యంలో వలస కూలీల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లాక్‌డౌన్ ఉండడంతో వలస కూలీలు తాము ఉన్నచోట పని లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రయాణ మార్గాలు నిలిపివేయడంతో వారు కాలినడకనే నమ్ముకున్నారు. ఈ ప్రయాణంలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాలినడకన ప్రయాణం సాగిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా తన కళ్ల ముందే స్నేహితుని ప్రాణం పోతున్నా ఏం చేయలేని పరిస్థితి లో ఒక వలసకూలీ అంతర్మథనం కళ్లకు కట్టింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
(క్వారంటైన్ సెంటర్‌లో కొట్టుకున్నారు)
వివరాలు.. అమ్రిత్ అతని స్నేహితుడు యాకూబ్‌లు గుజరాత్‌ల ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కంపెనీ మూయడంతో తమ స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చేరుకునేందుకు ఇండోర్‌కు చెందిన ఓ ట్రక్కును ఆశ్రయించారు. ట్రక్కు వెనకభాగంలో నిలబడే ప్రయాణించేలా ఒప్పందం చేసుకొని రూ. 4 వేలు చెల్లించారు. అయితే గంటలకొద్దీ నిలబడడంతో మార్గం మధ్యంలో అమ్రిత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా సమీపంలో ట్రక్కు నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అతనితో పాటు యాకూబ్ కూడా దిగిపోవాల్సి వచ్చింది. అస్వస్థతకు గురైన అమ్రిత్ తీవ్ర జ్వరంతో ఓపిక లేక స్నేహితుడి ఒడిలో ఒరిగాడు. రోడ్డు వెంబడి వెళ్తున్న వారిని సహాయం చేయాల్సిందిగా యాకూబ్ ఎంతగా ప్రాధేయపడ్డా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. (బేకరీ షాపు యజమానికి కరోనా పాజిటివ్)
ఈ ఘటనను అక్కడి స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే సాయం అందేలోపే అమ్రిత్ ప్రాణాలు విడిచాడు. 'నాతో పాటు వచ్చిన స్నేహితుడిని కోల్పోయాను. కాపాడమని వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు... కళ్ల ముందే స్నేహితుని ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా' అంటూ యాకూబ్ కన్నీటి పర్యంతమయ్యాడు. గంటలకొద్ది ట్రక్కులో నిలబడి ప్రయాణం చేయడంతో తీవ్ర జ్వరం, వాంతులు అవడంతో అమ్రిత్ మృతి చెందినట్లు సివిల్ సర్జన్ డాక్టర్ పీ.కే.ఖరే తెలిపారు.అయితే అమ్రిత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించామని, ఫలితాలు రాగానే స్పష్టత వస్తుందన్నారు. యాకూబ్‌ను సైతం క్వారంటైన్‌కు పంపించామని, అతనికి సంబంధించిన ఫలితం కూడా రావాల్సి ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment