
కడుపుబ్బనవ్విస్తున్న బైక్ దొంగతనం
ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ మూడేళ్ల కిందట జరిగిన దొంగతనం సంఘటన హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే 40 లక్షలమందికి పైగా వీక్షించిన ఆ వీడియో ఇంకా చాలామంది చూస్తూనే ఉన్నారు. మూడు నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోలో ఓ యువకుడు ఓ ఇంట్లో నుంచి బైక్ దొంగిలించేందుకు ఎన్నిపాట్లు పడ్డాడో.. చివరకు ఎలా విఫలమయ్యాడో రికార్డయి ఉంది. ఇది చూసిన ప్రతి వారు ఫక్కున నవ్వేస్తున్నారు. ఏప్రాంతంలో ఈ సంఘటన జరిగిందనే వివరాలు తెలియనప్పటికీ సరిగ్గా 2013 అక్టోబర్ 11, సాయంత్రం 4గంటల 49 నిమిషాల నుంచి 4.53 మధ్య చోటు చేసుకుంది.
ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం తొలుత ఇద్దరు యువకులు బైక్‌పై హెల్మెట్స్‌తో ఓ ఇంట్లోకి చూస్తూ ముందుకు వెళ్లారు. ఆ ఇద్దరు దొంగలే. వారిలో ఓ దొంగ హెల్మెట్‌తోనే ఆ ఇంటి గేటు వద్దకు వచ్చి తొలుత అటూ ఇటూ దిక్కులు చూశాడు. అనంతరం నేరుగా వెళ్లి చప్పుడు కాకుండా గేటు తెరిచాడు. లోపలికి వెళ్లి బైక్ తీసుకొచ్చే సమయంలోనే అసలు సమస్య మొదలైంది. అతడు గేటు పూర్తిగా తెరవకపోవడంతో ఆ బైక్ గేటు లోపల ఇరుక్కుపోయింది. దీంతో దాన్ని అందులో నుంచి తీసేందుకు అతడికి ముచ్చెమటలు పట్టాయి. ప్రయత్నిస్తుండగానే అలికిడి విని ఆ ఇంట్లో ఒకరు చూసి వెంటనే ఒక పెద్ద కర్రతో ఆ దొంగను కొట్టేందుకు రావడంతో బతుకు జీవుడా అంటూ బైక్‌ను అక్కడే వదిలేసిన దొంగ పారిపోయాడు.