జాలర్ల రక్షణకు కట్టబడి ఉన్నాం: కేంద్రం
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ:
మత్సకారుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ(రాజ్యసభ) విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ్చింది. భారత మత్సకారుల సంక్షేమం, భద్రత, రక్షణలకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజ్యసభ్యలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
శ్రీలంక- భారత్ మధ్య ఉన్న సముద్ర తీర జలాల్లో చేపలు పట్టే విషయంలో శ్రీలంక ప్రభుత్వం చేసిన సూచనలకు సంబంధించి వివరాలను విజయసాయి రెడ్డి కోరారు. మత్సకారుల సమస్యలపై నవంబర్ 5న న్యూఢిల్లీలో భారత్-శ్రీలంక మంత్రివర్గ స్థాయి సమావేశం జరిగిందని అక్బర్ వివరించారు. జాయింట్ వర్కింగ్ గ్రూప్(జేడబ్ల్యూజీ) ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు. మత్సకారుల సమస్యలను శాశ్వతంగా నిర్మూలించడానికి ద్వైపాక్షి సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
చేపల వేట, మత్సకారుల విషయాల్లోభారత్కు వివిధ దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి వివరాలను విజయసాయి రెడ్డి లిఖిత పూర్వకంగా అడిగారు. ఇతర దేశాల్లో బంధీలుగా పట్టుబడ్డ భారత జాలర్లను విడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు అక్బర్ తెలిపారు. భారత జాలర్ల సమస్యల పరిష్కారం కోసం పొరుగు దేశాలతో అవగాహనా, సహకారం పెంపొందించడానికి ధైపాక్షిక యంత్రాంగాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.