మంత్రి అశోక్ ఓఎస్డీకి భండారీ నుంచి 355 కాల్స్
- నెంబరు పెద్దగా గుర్తుపెట్టుకోలేదన్న ఓఎస్డీ అప్పారావు
- ఏడాదిన్నరలో 3-4 సార్లు కలిశాడని ప్రకటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లుగా భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొత్త మలుపు తిరిగింది. భండారీతో కేంద్ర విమానయాన మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అప్పారావు ఫోన్‌కాల్స్‌పై ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చకు తెరలేసింది. భండారీ ఇంట్లో విచారణ సంస్థల సోదాల్లో దొరికిన ఆధారాల్లో.. గతేడాదిగా అప్పారావుతో 355 సార్లు భండారీ మాట్లాడినట్లు వెల్లడైంది. అయితే తనకు భండారీ ఫోన్ చేసిన మాట వాస్తవమేనని అయితే.. చాలా తక్కువసార్లు చేసినందున ఆ నెంబరును గుర్తుపెట్టుకోలేదని అప్పారావు తెలిపారు.
మంత్రిని కలిసేందుకు భండారీ ఏడాదిన్నర కాలంలో మూడు, నాలుగు సార్లు ఇంటికొచ్చారని.. అయితే విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్నందుకే మంత్రి ఈయనతో మాట్లాడారాన్నారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్‌షోలో అశోక్ గజపతి రాజును భండారీ కలిసినట్లు వెల్లడించారు. కాగా, భండారీతో తనకు వ్యక్తిగత పరిచయమే తప్ప వృత్తిపరమైన సంబంధాల్లేవని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 2009లో వాద్రాకు చెందిన లండన్ ఇంటిని భండారీ కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. కాగా, బ్యాంకు అకౌంట్లు, ఆస్తులకు సంబంధించిన వివరాలివ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) భండారీకి నోటీసులు జారీ చేసింది.