
ప్రేమ మైకంలో పడి చివరకు..
నాసిక్: గురు శిశ్యులుగా ఉండాల్సిన ఆ ఇద్దరు మర్యాద మరిచారు. ప్రేమపేరుతో మైకంలో పడి చివరకు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో శిష్యురాలు చనిపోగా గురువు పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నాసిక్ లోని గలానే అనే గ్రామంలో చోటుచేసుకుంది. జల్ గావ్ జిల్లా చాలిస్ గావ్ తాలుకాలోని గలానే అనే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(17) అదే గ్రామానికి చెందిన సమధాన్ సుభాష్ పాటిల్ (27) అనే టీచర్ కు ఆకర్షణకు లోనైంది.
అనంతరం వారిద్దరు చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే, గత రెండు రోజులుగా వారిద్దరు కనిపించలేదు. ఈ క్రమంలో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారు నాసిక్ జిల్లాలోని చందవాడ్ ప్రాంతంలోగల చండ్రేశ్వరి ఆలయం వద్ద విషం తాగి స్పృహకోల్పోయి కనిపించారు. దీంతో వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా విద్యార్థిని చనిపోయింది. ఉపాధ్యాయుడు సుభాష్ చికిత్స పొందుతున్నాడు. వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో అనుమతించరేమోనన్న అనుమానంతోనే వారు జీవితాన్ని చాలించాలని విషం తీసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.