
గోవాలో అనాథ బాలికపై గ్యాంగ్ రేప్
దక్షిణ గోవాలో దారుణం జరిగింది. అనాథ బాలికను ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ నెల నుంచి పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని గోవా పోలీసులు వెల్లడించారు. క్యుపెమ్ అనే పట్టణంలో ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తనపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి, ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసులో కొన్ని వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ గవాస్ చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావచ్చని, అయితే తాము ఇంకా అతడిని విచారించాల్సి ఉందని అన్నారు. విచారణ తర్వాత మాత్రమే నిందితుల పేర్లు, వయసు వెల్లడించగలమని తెలిపారు. ప్రస్తుతానికి ఆ బాలికను పనజిలో ఉన్న ఓ మిషనరీ ట్రస్టుకు తరలించి, అక్కడ రక్షణ కల్పిస్తున్నారు.