
ఆమె ఫోన్ చేసింది
చెన్నై: మద్రాస్ ఐఐటీ నుంచి అదృశ్యమైన తెలుగు విద్యార్ధిని వేదాంతం ఎల్ ప్రత్యూష (20) కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడింది. అయితే ఎక్కడి నుంచి మాట్లాడిందనే విషయం వెల్లడించలేదు. తన కూతురు ఫోన్ లో మాట్లాడిందని గుంటూరులోని బ్రాడీపేటలో ఉంటున్న ప్రత్యూష తల్లి తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, తన గురించి కంగారు పడొద్దని ప్రత్యూష చెప్పిందన్నారు. అయితే తమ కుమార్తె భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రత్యూష ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్‌లో ఉంటున్న ఆమె హిమాలయాలకు వెళుతున్నట్టు లేఖ రాసి అదృశ్యమైంది. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.