► ఆలిండియా పర్సనల్ లా బోర్డు స్పష్టీకరణ
► బాబ్రీ అంశంలో కోర్టు వెలుపలి ఒప్పందాలకు నో
లక్నో: ‘పర్సనల్ లా’ అనుసరించడమనేది ముస్లింల రాజ్యాంగపరమైన హక్కు అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నొక్కి చెప్పింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి బోర్డు అంగీకరిస్తుందని, అయితే ‘కోర్టు వెలుపలి ఒప్పందాల’కు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రవర్తనా నియమావళిని జారీ చేయాలని బోర్డు నిర్ణయించిందని ఏఐఎమ్‌పీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ ఆదివారం చెప్పారు. షరియా (ఇస్లామిక్ లా) కారణాలు తెలపకుండా విడాకులు ఇచ్చే వారు సాంఘిక బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
శుక్రవారం నమాజ్ సమయంలో ఈ ప్రవర్తనా నియమావళిని చదివి వినిపించాలని ఇమామ్‌లను బోర్డు అభ్యర్థించింది. షరియత్ చట్టాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని, దేశంలోని మెజారిటీ ముస్లింలు ‘పర్సనల్ లా’లో ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదంది. పర్సనల్ లా అమలు చేయడంలో అడ్డంకులు సృష్టించొద్దని రెహ్మానీ అభ్యర్థించారు. తలాక్ దుర్వినియోగమైన మహిళలకు బోర్డు అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు అస్మా జహ్రా మాట్లాడుతూ.. తలాక్ విషయం మత సంబంధమైనది కాదని, సామాజిక సంబంధమైనది చెప్పారు. భారత్‌లో మహిళల సమస్యలు ఒకటేనని, ఈ అంశంలో ‘ముస్లిం లా’ని ఒక్కటే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
బాబ్రీ వివాదంపై...: రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనను ఏఐఎమ్‌పీఎల్‌బీ తిరస్కరిం చింది. సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు మాత్రమే తమకు సమ్మతమని స్పష్టం చేసింది. కోర్టు వెలుపల ఒప్పందాలను అంగీకరించబోమని రెహ్మానీ చెప్పారు. ఈ మేరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరిం చుకోవాలని గత మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని నాడు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ చెప్పారు.