మోడీ వందరోజుల పాలనకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: మోడీ వందరోజుల పాలనలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా యూత్‌కాంగ్రెస్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆందోళనలు నిర్వహించింది. ఆందోళనకు ‘వందరోజుల్లో మోడీ వైఫల ్యం’ పేరు కూడా పెట్టింది. ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలేవి? మోడీ ప్రభుత్వం ఎన్ని హామీలను నెరవేర్చింది? అనే విషయాలను ఆందోళన ద్వారా ప్రజలకు వివరించి చెప్పాలని నిర్ణయించింది. అంతేకాక హామీలను నెరవేర్చని సంబంధిత నేతల కార్యాలయలను ముట్టడిస్తామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతావ్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం ముందు, కృషి భవన్ ఎదుట, రైల్‌భవన్ ఆవరణలో యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిం చారు. మరో రెండ్రోజులపాటు కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సతావ్ తెలిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని 20 రోజుల క్రితమే అనుమతి కోరామని, అందుకు అధికారులు తిరస్కరించడంతో రోడ్లపైకి రావాల్సి వచ్చిందని సతావ్ చెప్పారు. ట్విటర్ ద్వారా కూడా మోడీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైల్‌భవన్ వద్ద ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీల తో విరుచుకుపడ్డారని, వందలమంది కార్యకర్తలను గాయపర్చారని, దీనిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. వందరోజుల్లో మోడీ చేయలేకపోయిన వంద పనుల గురించి మరింత ప్రచారం చేస్తామని చెప్పారు.