సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటి దొంగల కదలికలు బయటపడుతున్నాయా?. సొంత నేతలను, అదీ సీనియర్లను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ రగడ వెలుగుచూసిన తరుణంలో ప్రస్తుతం ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. తనతో పాటు ఇతర నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.
తనపైనా, ఓ సీనియర్‌పైనా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మే 5వ తేదీన ఉత్తమ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెంబర్ నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ నెంబర్ భీమవరానికి చెందిన ఓ మహిళ పేరు మీద ఉందని గుర్తించారు. కానీ, ఆ నెంబర్ వాడిన లొకేషన్ మాత్రం ఉత్తమ్ ఇంటి సమీపంలోనే ఉంది.
ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఓ ప్లాట్ నుంచి ఈ తతంగం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆ ప్లాట్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పేరు మీద ఉండడం, ఆ విభాగపు ఇంఛార్జి జయల ప్రశాంత్ తన టీంతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, డేటా సేకరించారు. ఐదు కంప్యూటర్‌లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు.
ప్రశాంత్‌పై కేసు నమోదు
మరోవైపు భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్ కాంగ్రెస్ మీటింగ్‌లో కూడా ఆయన.. తనపైనా ఇదే తరహా ప్రచారం జరుగుతోందని అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి. తమ విచారణలో ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ క్యాంపెయిన్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తేల్చారు. అనుచిత పోస్టులతో ట్రోలింగ్‌కు పాల్పడినందుకుగానూ ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రశాంత్‌పై వేటు..
ఉత్తమ్‌కుమార్‌తో పాటు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క్, మరికొందరు నేతలపైనా ఈ ట్రోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టలు చేసినందుకుగానూ ప్రశాంత్‌పై పార్టీ వేటు వేసింది. అయితే.. ఈ పరిణామంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివనసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే.. వార్‌రూమ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన. ఈ వ్యవహారం ఇక్కడితోనే చల్లారుతుందా? లేదంటే ఇంకా ఎక్కడిదాకా అయినా వెళ్తుందా? అనే వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment