చూస్తూ ఊరుకోవద్దు.. దీటుగా స్పందించండి
'ఎలాంటి బ్లాక్మెయిల్కు లొంగద్దు. మీరు తగిన విధంగా స్పందించండి. వాళ్లు కాలుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోనక్కర్లేదు. దీటుగా ముందుకెళ్లండి' అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైన్యానికి చెప్పారు. జాతీయభద్రతా సలహాదారు నేతృత్వంలో తగిన సలహాలు తీసుకుని, ముందుకు దూసుకెళ్లాలని సూచించారు. ఒకవైపు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో తల మునకలుగా ఉన్న మోదీ.. పాకిస్థాన్ కాల్పుల విషయాన్ని సరిగా పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ విమర్శలకు ఆయన ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. అటు ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తూనే ఇటు భద్రతా దళాలకు కూడా తనవైపు నుంచి ఇవ్వాల్సిన సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ ఆయన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలకు వెళ్తూనే ఉన్నారు.
మరోవైపు గత వారం రోజులుగా పాకిస్థాన్ కాల్పులు మరీ ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ తమ పక్కనే బాంబుల వర్షం కురుస్తోందని, ఎప్పుడు ఎటు నుంచి ఏ తూటాలు దూసుకొస్తాయో, బాంబులొచ్చి నెత్తిమీద పడతాయో చెప్పలేకపోతున్నామని కాశ్మీరీలు వాపోతున్నారు. 2003లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో పౌరులు మరణించడం ఇదే తొలిసారి. చివరకు గురువారం ఉదయం కూడా పాక్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. దాంతో ఐదుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. 60 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ దళాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేవరకు పాక్తో చర్చల ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు.