'మోదీ పేదల మెస్సయ్య.. రాద్ధాంతం చాలు'
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరైనప్పటికీ కూడా సభ వ్యవహారాలను అనవసరంగా ఆగిపోయేట్లు చేస్తున్నారని మండిపడ్డారు. వారికున్న అలవాటు ప్రకారమే సభలో గగ్గోలు చేస్తున్నారన్నారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కూడా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై సభలో చర్చ జరగాలని ప్రభుత్వం విపక్షాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీల నేతలు లోక్ సభలో, రాజ్యసభలో పట్టుబట్టారు. ప్రధాని మోదీ నేరుగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో గందరగోళం నెలకొని అటు లోక్ సభ 12గంటల వరకు వాయిదా పడగా రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతం అవుతుందని, ఇదొక ధర్మయుద్ధమని కొనియాడారు. ప్రజలు కూడా బీజేపీ వెనుకే ఉన్నారని, వారంతా మోదీని తమ రక్షకుడు (మెస్సయ్య) అని భావిస్తున్నారని చెప్పారు. పేదలంతా మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని వివరించారు. అయినప్పటికీ లోక్ సభలో అదే పరిస్థితి కనిపించడంతో లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.