
ఇంగ్లండ్ కెప్టెన్‌పై జోక్ పేల్చిన మోదీ!
ప్రధాని నరేంద్రమోదీ మంచి వక్త మాత్రమే కాదు.. సందర్భానుసారంగా చలోక్తులు విసరడంలోనూ ఆయన దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. బ్రిటన్ ప్రధాని థెరిసా మే సమక్షంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌కోట్ టెస్టులో అత్యుత్తమంగా రాణించిన క్రికెట్ జట్టే విజయం సాధిస్తుందని మోదీ అన్నారు. అయితే వీరి సంభాషణలో ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలిస్టర్ కుక్ విషయం ప్రస్తావనకు వచ్చిందని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని థెరిసాకు విందు ఇచ్చిన అనంతరం ఆమెను వంటలు ఎలా ఉన్నాయని మోదీ అడిగారట. బహుశా భోజనం మీకు ఆనందాన్ని ఇచ్చిందనుకుంటా అని మోదీ అనగానే.. అవును.. భోజనం చాలా బాగుందని థెరిసా జవాబిచ్చారు. 'మంచి రుచికరమైన భోజనం చేసే కుక్ మా వద్ద ఉన్నాడు. కానీ అసలైన కుక్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో పాటే భారత పర్యటనకు వచ్చాడుగా' అంటూ థెరిసాతో చర్చ సందర్భంగా మోదీ చమతర్కించారని వికాస్ స్వరూప్ మీడియాకు తెలిపారు. ఈ విధంగా ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ పై మోదీ జోక్ పేల్చగానే అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది.