సిమ్లా: అక్టోబర్ మొదటి వారంలో అగ్ర నేతల పర్యటనలతో శీతల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ వేడెక్కనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్, పాలనా పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు ఇరు పార్టీలు ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు రంగంలోకి దిగాయి. అక్టోబర్ తొలి వారంలో బీజేపీ, కాంగ్రెస్ వరుస ర్యాలీలతో హోరెత్తించనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 3న ఎయిమ్స్‌ను ప్రారంభించి బీజేపీ ర్యాలీలో పాల్గొంటుండగా, అక్టోబర్ 7న రాహుల్ పర్యటించనున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పలు ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందుకు దీటుగా ప్రధాని మోదీచే బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌కు శంకుస్ధాపన, ఉనా జిల్లాలో ఐఐటీ, కాంగ్రా జిల్లాలో స్టీల్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేయించేందుకు బీజేపీ పూనుకుంది. బిలాస్‌పూర్ ర్యాలీలో మోదీ పవనాలతో హిమాచల్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.