సాక్షి,సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అగ్రనేతల సంవాదంతో తారాస్థాయికి చేరింది. జీఎస్‌టీ, నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి భగవద్గీతను అందుకున్నారు. గీతకు ప్రధాని తనదైన భాష్యం చెబుతున్నారని అన్నారు. భగవద్గీతలో ‘నీ పని నీవు చేయి..ఫలితాన్నినాకు వదిలేయ్’ అన్న సూక్తికి మోదీ వేరే అర్థం ఇచ్చారని చెప్పారు. ‘ఏ పనీ చేయకు..ఇతరుల కష్టార్జితాన్ని స్వాహా చేద్దాం’ అని మోదీ సరికొత్త భాష్యం చెప్పారని రాహుల్ చురకలు వేశారు.
హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఇక్కడ ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాదన్నప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ దీటుగా బదులిచ్చారు. పంటాసాహిబ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దుపై రాహుల్ పలు సభల్లో మోదీ నిర్ణయాలను తప్పుపడుతూ పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని అవినీతి, కుంభకోణాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఇరురాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment