కాంగ్రెస్‌ది గతించిన చరిత్ర
► ఆ పార్టీని నమ్మకండి
► పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మోదీ
జలంధర్(పంజాబ్): కాంగ్రెస్ అధికారం కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీది గతించిన చరిత్ర అని, దాన్ని నమ్మకూడదని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ శుక్రవారమిక్కడ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ. అది ఒడ్డుకు చేర్చదు. అందులో ఎక్కకూడదు. అదొక చిత్రమైన పార్టీ. అధికార దాహంతో పశ్చిమ బెంగాల్‌లో మనుగడ కోసం వామపక్షాలతో జట్టుకట్టింది. తనకు ఇచ్చిన సీట్లకు ఒప్పుకుంది. యూపీలో గతంలో ఎస్పీని దుయ్యబట్టి ఇప్పుడు అధికారం కోసం పొత్తుకు వెళ్లింది.. ఎస్పీలోని అంతర్గత గొడవతో కాగ్రెస్‌కు ఒక అవకాశం కనిపించింది. రాజకీయ అవకాశవాదం కాంగ్రెస్ ప్రత్యేకత’ అని అన్నారు.
ఎరువుల రంగంలో అవినీతి అరికట్టామని, మాజీ సైనికులకు ఒక ర్యాంకు–ఒక పింఛను హామీని సాకారం చేశామని తెలిపారు. నోట్ల రద్దుపై గత మూడు నెలలుగా తాను దాడులకు ఎదుర్కొంటున్నానన్నారు. ‘నేను మోదీని. ఇలాంటి దాడులకు తలొగ్గను’ అని స్పష్టం చేశారు. గత 70 ఏళ్లలో అక్రమ సంపదను కూడగట్టిన వారు నోట్ల రద్దు నిర్ణయాన్ని జీర్ణించుకోలేక తనను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఇంట్లో రూ. 150 కోట్ల డబ్బును సీజ్ చేశారని, అయినా కాంగ్రెస్ అతన్ని పదవి నుంచి తప్పించలేదని ఆక్షేపించారు. దేశాన్ని నల్లధన రహితం చేయడానికి అవినీతిపై తాను ప్రారంభించిన ఉద్యమం రాజకీ యాలకు అతీతమైందని వ్యాఖ్యానించారు.
హరియాణా, పంజాబ్‌ల మధ్య నలుగుతున్న సట్లేజ్ యమునా కాలువ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సాగు కోసం నీటిని వాడుకునే హక్కు పంజాబ్‌కు ఉందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోకి ప్రవహిస్తూ వ్యర్థంగా వెళ్లిపోతున్న సింధు జలాలను పంజాబ్‌కు తీసుకొస్తామని చెప్పారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత రాహుల్‌పై ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్ర యువత ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు రాజకీయాలను దారుణంగా దిగజారుస్తున్నారని, అలాం టి వారికి బుద్ధి చెప్పడానికి అసెంబ్లీ ఎన్నికలు మంచి మార్గని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శిరోమణి అకాలీ దళ్– బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.