
జూన్ 7న మోదీ అమెరికా పర్యటన
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా 7న వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ కానున్నారు. ‘వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీలపై ఇరుదేశాల భాగస్వామ్యం.. రక్షణ, భద్రతల్లో సహకారం.. ఆర్థిక అభివృద్ధి ప్రాధాన్యాలు తదితర అంశాల్లో సాధించిన పురోగతిపై మోదీతో ఒబామా చర్చిస్తారు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ ర్యాన్ కోరారని, దానికి ప్రధాని అంగీకరించారని పేర్కొంది. జూన్ 7న కంపెనీల సీఈవోలతో మోదీ సమావేశమవుతారని తెలిపింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మో హన్‌సింగ్ తర్వాత అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న ఐదో ప్రధానిగా మోదీ రికార్డులకెక్కనున్నారు. ఆదివారం ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ.. జూన్ 4 నుంచి రెండ్రోజులపాటు ఖతార్‌లో పర్యటించనున్నారు.