మహారాష్ట్రలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్?
Published Thu, Dec 3 2015 3:10 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM
ముంబై: మహారాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారా? స్థానిక రైతులను, కార్మికులను అప్పుల పేరుతో వేధించిందా? అప్పులు తీర్చకపోతే కిడ్నీలు అమ్ముకోమని బలవంతం చేసిందా.. తాజాగా అంకోలా పోలీసులు బృందం దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు దీన్నే బలపరుస్తున్నాయి. అటు జిల్పా ఎస్పీ సీకే మీనా కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
టూరిస్టు వీసాతో శ్రీలంక వెళుతున్న సంతోష్ గాలి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కిడ్నీ ముఠా గుట్టు రట్టయింది. విదర్భ, అంకోలా తదితర ఏరియాల్లోని పేద రైతులను, కార్మికులను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నవైనం బైటపడింది. శ్రీలంక కేంద్రంగా అక్రమ కిడ్నీ దందా నడుస్తున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను, ఏజెంట్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అంకోలాకు చెందిన సంతోష్ గాలీ, శ్రీలంకకు చెందిన వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ దగ్గర 20 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాల్సిందిగా ఆనంద్ జాదవ్ ఒత్తిడి చేశాడు. అప్పు తీర్చలేకపోతే కిడ్నీ అమ్ముకోవాల్సిందిగా ప్రలోభ పెట్టాడు. అలా చేస్తే 20 వేల అప్పు మాఫీతో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించాడు. దీంతోపాటు శ్రీలంకలోని ఆసుపత్రిలో కిడ్నీ ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసుల అప్రమత్తతతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడింది.
అటు అప్పు తీర్చకపోతే చంపేస్తామని బెదరించారని బాధితుడు గాలి పోలీసులకు తెలిపాడు. ఇక వేరే గత్యంతరం లేక కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డట్టు వివరించాడు. నాలుగు లక్షలని చెప్పి రెండు లక్షలు మాత్రమే ఇచ్చారన్నాడు. బాధితుడు గాలి, వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ సహా, గాలి శ్రీలంక వెళ్లేందుకు వీసా,పాస్పోర్టు ఏర్పాటు చేసిన దేవేంద్ర షిర్సత్ అనే ఏజెంటునూ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు బాధితుడు గాలికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన నాగ్పూర్ ఆసుపత్రి, శ్రీలంకలోని ఆసుపత్రి జోక్యంపై కూడా ఆరాతీస్తున్నామన్నారు. ఈపరిణామాలన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులును, పేద కార్మికులను అప్పుల పేరుతో లోబర్చుకుంటున్న ముఠా, అక్రమ కిడ్నీ వ్యాపారం నిర్వహిస్తోందనే అనుమానాన్ని ఎస్పీ సీకే మీనా వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత కిడ్నీ సిండికెట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారం తమ ప్రాథమిక విచారణలో తేలిందని పూర్తి విచారణ అనంతరం ,త్వరలోనే వివరాలు వెల్లడిచేస్తామన్నారు.
Advertisement
Advertisement