ఈసారి లక్షమంది రైతులతో ర్యాలీ | More Than One Lakh Farmers March | Sakshi
Sakshi News home page

ఈసారి లక్షమంది రైతులతో ర్యాలీ

Published Sat, Apr 28 2018 4:10 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

More Than One Lakh Farmers March  - Sakshi

రైతుల ర్యాలీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో నాసిక్‌ నుంచి ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌ వరకు రైతులు నిర్వహించిన మహా యాత్రను దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం అప్పుడే మరచిపోయినట్లు ఉన్నారు. రైతుల డిమాండ్లను కచ్చితంగా రెండు నెలల్లోగా అమలు చేస్తామని ఫడ్నవీస్‌ రైతు నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చి అప్పుడే నెలన్నర రోజులు గడిచిపోయాయి. అయినా రైతుల డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో వేసిన కమిటీ కూడా పేరుకు మాత్రమే రెండు సార్లు భేటీ అయింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.

మరో నెల రోజుల్లో అంగీకరించిన తమ డిమాండ్లన్నింటిని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం నెరవేర్చక పోయినట్లయితే జూన్‌ ఒకటవ తేదీన లక్ష మంది రైతులతోని నిరసన యాత్రను నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నాయకుడు డాక్టర్‌ అజిత్‌ నావెల్‌ హెచ్చరించారు. గతంలో తాము శాంతియుతంగా యాత్ర జరిపామని, ఈ సారి యాత్ర సందర్భంగా విధ్వంసం జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు నాయకులను చర్చలకు పిలవలేదని ఆయన చెప్పారు.

గత మార్చి నెలలో నాసిక్‌ నుంచి ముంబైలోని ఆజాద్‌ మైదానానికి దాదాపు 40 వేల మంది రైతులు నిరసన యాత్ర జరపడం, అది ఎంతో శాంతియుతంగా కొనసాగడం తెల్సిందే. దాదాపు 180 కిలోమీటర్లు నడిచి వచ్చిన రైతులు చివరి పది, పదిహేను కిలోమీటర్ల దూరాన్ని రాత్రిపూట మౌనంగా నడిచారు. రాష్ట్ర విధాన సభను ముట్టడిస్తే పదవ తరగతి విద్యార్థు పరీక్షలకు అంతరాయం ఏర్పడుతుందంటే ఆ ఆందోళనను విరమించి తమ నిరసన వేదికను కూడా ఆజాద్‌ మైదాన్‌కు మార్చుకున్నారు.

రైతులు తీసుకున్న రుణాల మాఫీని త్వరితగతిన సక్రమంగా అమలు చేస్తామని, రైతులకు పెట్టుబడికన్నా ఒకటిన్నర రెట్టు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని, కొన్ని దశాబ్దాలుగా అటవి భూములు దున్నుకుంటున్న ఆదివాసీలకు 2006 నాటి అటవి హక్కుల చట్టాన్ని మార్చి పట్టాలిస్తామని, రైతుల రుణాల పింఛన్లను నెలకు 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతామని ఫెడ్నవీస్‌ హామీ ఇచ్చారు.

రైతు కూలీలకు కూడా పింఛను ఇవ్వాలి, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలనే డిమాండ్లను మాత్రం నాడు ఫడ్నవీస్‌ అంగీకరించలేదు. ఎంతో కాలం నుంచి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రైతులు పెద్ద నోట్ల రద్దు వల్ల, పశువుల వధ నిషేధ చట్టం వల్ల మరింత నష్టపోయారు. 1995 నుంచి 2015 వరకు రాష్ట్రంలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాలంలో దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1995 నుంచి 2015 మధ్య కాలంలో ఎక్కువగా కాంగ్రెస్‌–ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు ఫడ్నవీస్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా రైతుల సంక్షేమం కోసం ఏమీ చేయలేకపోతోంది. దేశానికి వెన్నుముక రైతు అనడమేగానీ ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు.

కాలం కలిసి రాక (వర్షాభావం లేదా అధిక వర్షాలు పడడం) రైతులు నష్టపోతున్నారని అంటారుగానీ అది తప్పు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ ఆర్థిక విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారు లేదా అభివద్ధిలోకి రాలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ ఆర్థిక విధానాన్ని అమలు చేసినప్పుడే రైతులు బాగు పడతారు. ఈ అంశాన్ని అన్ని కోణాల నుంచి చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కనీసం 20 రోజులైనా నిర్వహించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement