రైళ్లలో మరిన్ని ఆర్ఏసీ బెర్తులు!
రైళ్లలో మరిన్ని ఆర్ఏసీ బెర్తులు!
Published Tue, Dec 20 2016 9:30 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు రిజర్వేషన్ చేయించుకుందామంటే వెయిటింగ్ లిస్టు లేదా ఆర్ఏసీ కనిపిస్తుంది. ఆర్‌ఏసీ అంటే ఎంతో కొంతవరకు బెర్తు కన్ఫర్మ్ అవుతుందనే ఆశ ఉంటుంది. లేకపోయినా.. ఎలాగోలా ప్రయాణం చేయొచ్చని భావిస్తారు. ఇప్పుడు అలాంటివాళ్ల కోసం రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. మొత్తం అన్ని రైళ్లలోను ఆర్‌ఏసీ (రిజర్వేషన్ ఎగైనెస్ట్ కాన్సిలేషన్) కింద మరిన్ని బెర్తులను అందుబాటులోకి తేనుంది. స్లీపర్ బోగీలలో ప్రస్తుతం ఐదు ఆర్ఏసీ బెర్తులు మాత్రమే ఉండగా, దాన్ని ఏడుకు పెంచాలని నిర్ణయించింది. సాధారణంగా పూర్తిగా బెర్తు కన్ఫర్మ్ కాకుండా ఆర్ఏసీలోనే ఉండిపోతే.. మనకు కనీసం కూర్చోడానికి సీటు దొరుకుతుంది. ఇలా ఇన్నాళ్లూ ఐదు బెర్తులు అంటే.. పది మందికి సీట్లు ఇస్తుండగా, దాన్ని ఏడు బెర్తులకు.. అంటే 14 సీట్లకు పెంచారు. సైడ్ లోయర్ బెర్తులో ఎదురెదురుగా ఇద్దరి చొప్పున కూర్చోవచ్చు. ఈ నిర్ణయం 2017 జనవరి 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
ఇక థర్డ్ ఏసీ బోగీలలో అయితే ఇప్పుడున్న రెండు బెర్తుల నుంచి నాలుగు బెర్తులకు ఆర్ఏసీ కోటా పెంచారు. అలాగే సెకండ్ ఏసీ బోగీలలో ఇప్పుడున్న రెండు నుంచి మూడు బెర్తులకు ఈ కోటా పెంచారు. కూర్చోడానికి మాత్రమే అవకాశం ఇచ్చినా, ఇందులో పూర్తి చార్జి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మరింతమందికి రైలు ప్రయాణం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement